అమరావతి, అక్టోబర్ 30 ,డైనమిక్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐదు రోజులపాటు లండన్ పర్యటనకు బయలుదేరుతున్నారు. నవంబర్ 1న ఆయన లండన్ చేరుకుని పలు వ్యాపార, పారిశ్రామిక సమావేశాల్లో పాల్గొననున్నారు.
సీఐఐ ఆధ్వర్యంలో రోడ్‌షో
లండన్‌లో సీఐఐ (కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) ఆధ్వర్యంలో జరగనున్న రోడ్‌షోలో సీఎం చంద్రబాబు పాల్గొని, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. రాష్ట్రంలోని మౌలిక వసతులు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, నూతన విధానాలపై ఆయన అక్కడి పారిశ్రామిక వేత్తలకు వివరించనున్నారు.
విశాఖ భాగస్వామ్య సదస్సుకు ఆహ్వానం
లండన్ పర్యటనలో ముఖ్యంగా నవంబర్‌లో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (భాగస్వామ్య సదస్సు)కు పెట్టుబడిదారులను ఆహ్వానించనున్నారు. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలను ఆకర్షించాలన్న లక్ష్యంతో సీఎం చురుకుగా ముందడుగు వేస్తున్నారు.
నవంబర్ 6న తిరుగు ప్రయాణం
లండన్ పర్యటన పూర్తయిన అనంతరం నవంబర్ 6న సీఎం చంద్రబాబు తిరిగి అమరావతికి చేరుకోనున్నారు.
