నల్లగొండ బ్యూరో,డైనమిక్ , అక్టోబర్ 29
నల్లగొండ జిల్లాలో చట్ట విరుద్ధంగా ఇద్దరు శిశువులను అక్రమంగా దత్తతకు ఇచ్చిన ఘటనలో ఏడు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెస్క్యూ చేసి ఇద్దరు బిడ్డలను సురక్షితంగా శిశు గృహానికి తరలించారు. మధ్యవర్తిత్వం చేసిన డాక్టర్ మరియు మరో వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. నిందితుల వద్ద నుండి 20 వేల రూపాయలు, ఏడు మొబైల్ ఫోన్లు, దత్తత ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.బుదవారం ఈ ఘటనపై జిల్లా పోలీసు కార్యాలయంలో ఎర్పాటు చేసిన మిడియా సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ,మహిళా శిశు సంక్షేమ అధికారి, జిల్లా బాల సంక్షేమ అధికారి, ఐసిడిఎస్ అధికారులతో కలిసి వివరాలు వెల్లడించారు.
అక్రమ దత్తత కేసుల వెలికితీత
నల్లగొండ పట్టణంలో అక్రమ దత్తత కేసులు వెలుగులోకి రావడంతో పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అక్టోబర్ 27, 28 తేదీల్లో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించి, డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో నిందితులను అరెస్ట్ చేశారు.
మొదటి కేసు వివరాలు
కేసు నంబర్: 313/2025
చట్ట విభాగాలు: బాలల న్యాయ చట్టం 80, 81 సెక్షన్లు ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎల్లాపురం గ్రామానికి చెందిన కుర్ర బాబు. తన భార్య పార్వతికి ఆడపాప పుట్టిన కారణంగా ఆడపిల్లను సాకడం భారమని భావించి విక్రయించేందుకు ప్రయత్నించాడు. హాలియాలోని నిర్మల ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ శాంతి ప్రియ ద్వారా ఏలూరుకు చెందిన సాంబమూర్తి దంపతులకు పాపను రెండు లక్షల ముప్పై వేల రూపాయలకు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.అక్టోబర్ 25న నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో పాపను అప్పగించడంతో ఈ అక్రమ దత్తత పూర్తయింది. విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు.
రెండవ కేసు వివరాలు
కేసు నంబర్: 389/2025
చట్ట విభాగాలు: బాలల న్యాయ చట్టం 80, 81 సెక్షన్లు గుర్రంపోడు మండలం కోనాయిగూడెం గ్రామానికి చెందిన ఓర్సు శ్రీను, తన భార్య మమతతో కలిసి పుట్టిన బిడ్డను అమ్మడానికి కుట్ర పన్నారు. కనగల్ మండలం బోయినపల్లి గ్రామానికి చెందిన వేముల నాగరాజు, సువర్ణ దంపతులకు నాలుగు లక్షల యాభై వేల రూపాయలకు మగబిడ్డను విక్రయించారు.విచారణలో నిందితులు ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. పోలీసులు బాబును రక్షించి శిశు గృహానికి అప్పగించారు.
పోలీసుల వేగవంతమైన చర్యలు
డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో పోలీసులు కేవలం 24 గంటల్లోనే నిందితులను పట్టుకుని రెండు శిశువులను రక్షించారు. విచారణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, బాల సంక్షేమ అధికారి గణేష్, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, ఎస్ఐ సైదులు, గోపాలరావు, సిబ్బంది రబ్బాని, షకీల్, కిరణ్, అంజి, ఫారూక్, సత్యనారాయణ, అలాగే ఐసిడిఎస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అభినందించారు.
జిల్లా ప్రజలకు ఎస్పీ సూచన
గ్రామాలు, వార్డులు, తండాలలో ఆడపిల్లలను అమ్మడం, కొనడం, దత్తత పేరుతో వ్యాపారం చేయడం, గర్భస్రావాలు చేయించడం వంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీస్ స్టేషన్ లేదా ఐసిడిఎస్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ హెచ్చరించారు.



