

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో రాష్ట్రంలో రెండో స్థానంలో నల్గొండ జిల్లా
జిల్లా యంత్రాంగాన్ని అభినందించిన గృహనిర్మాణ శాఖ ఎండి పి.గౌతమ్
డైనమిక్, నల్లగొండ బ్యూరో, అక్టోబర్ 16
ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలులో రాష్ట్రవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకున్న నల్గొండ జిల్లా మరోసారి ప్రతిభ చాటుకుంది. గృహనిర్మాణంలో విశిష్టమైన ఫలితాలు సాధించినందుకు రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.గౌతమ్ జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు.బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నల్గొండ జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్‌కుమార్‌కు ల్యాప్‌టాప్, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.నల్గొండ జిల్లాకు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మొత్తం 19,625 గృహాలు కేటాయించగా, వాటిలో 17,247 గృహాలు మంజూరు, 13,581 గృహాలు గ్రౌండ్ అయ్యాయి. వీటిలో 10,116 గృహాలు వివిధ దశల్లో ఉండగా, పలు గృహాలు పూర్తయ్యాయి.ఒకే సెప్టెంబర్ నెలలోనే 5,919 గృహాలు గ్రౌండ్ అయ్యాయి. అదేవిధంగా లబ్ధిదారులకు ₹80 కోట్ల చెల్లింపులు జరిపినట్లు అధికారులు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఇందిరమ్మ ఇండ్ల సమీక్ష సమావేశంలో మంజూరు, గ్రౌండింగ్, చెల్లింపులు, ఫిజికల్ & ఫైనాన్షియల్ పురోగతి, దరఖాస్తుల పరిశీలన (L1, L2, L3), మోడల్ ఇండ్ల నిర్మాణం తదితర అంశాలలో నల్గొండ జిల్లా అత్యుత్తమ పనితీరు కనబర్చింది.రాష్ట్రంలో మొదటి స్థానంలో నారాయణపేట, రెండో స్థానంలో నల్గొండ జిల్లా నిలిచినట్లు గృహనిర్మాణ శాఖ వెల్లడించింది.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఈ విజయంపై గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండలో గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్‌ను శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు, శాఖ సిబ్బంది కలిసి గృహనిర్మాణ శాఖ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
