Thursday, January 15, 2026
Homeఆంధ్ర ప్రదేశ్నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – మంత్రి పార్థసారథి బాపట్లలో ముంపు ప్రాంతాలు పరిశీలన

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – మంత్రి పార్థసారథి బాపట్లలో ముంపు ప్రాంతాలు పరిశీలన

డైనమిక్ న్యూస్, బాపట్ల, అక్టోబర్ 29

మొంథా తుఫాన్‌ ప్రభావంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సమాచార, గృహనిర్మాణశాఖ మంత్రి మరియు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బుధవారం ఆయనతో పాటు రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు.

పంటల నష్టం అంచనాకు ఆదేశాలు

వరదలతో దెబ్బతిన్న వరి, మిరప పంటలపై సమగ్ర అంచనాలు వేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి పార్థసారథి తెలిపారు. తుఫాన్‌ ప్రభావం వల్ల కొంత నష్టం జరిగినప్పటికీ ఎక్కడా ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు.

విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు

విద్యుత్‌ స్తంభాలు విరిగిన ప్రాంతాల్లో సాయంత్రం కల్లా కొత్త స్తంభాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. తుఫాన్‌ వల్ల నష్టపోయిన వ్యవసాయ, ఉద్యానవన రైతులకు ప్రభుత్వం పరిహారం అందజేస్తుందని హామీ ఇచ్చారు.

మత్స్యకారుల గృహ నిర్మాణాలు

అడవిపల్లెపాలెం గ్రామంలోని మత్స్యకారులకు గృహాలు మంజూరు చేయనున్నట్టు మంత్రి తెలిపారు. స్థలాలు ఉన్న వారికి వెంటనే గృహాలు కేటాయించడంతో పాటు స్థలాలు లేని వారికి సర్వే నిర్వహించి భూములు, పట్టాలు ఇచ్చి పీఎంఏవై 2.0 పథకం కింద ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు.

త్రాగునీటి సమస్య పరిష్కారం

గ్రామంలో త్రాగునీటి సరఫరా మెరుగుపరచడానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

విద్యుత్‌ శాఖ మంత్రి రవికుమార్‌ హామీ

తుఫాన్‌ కారణంగా జిల్లాలో విరిగిపోయిన 100 విద్యుత్‌ స్తంభాలు పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నామని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకి గుండ్లకమ్మ ప్రాజెక్టులో చిక్కుకున్న ముగ్గురు సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని చెప్పారు.తదనంతరం మంత్రులు పాండురంగాపురం, అడవిపల్లెపాలెం గ్రామాల్లో రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఆర్డీవో పి. గ్లోరియా, తహసీల్దార్ సలీమా తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments